ఆ రాత్రి అక్రూరుడు బలరామకృష్ణులతో సహా సుఖమైన భోజనం చేసి, ఒకచోటనే అందరూ పడుకున్నప్పుడు, "నాయనా, తల్లిగర్భం నుంచి బయటపడుతూనే ఇలాటి హీనజీవితంపాలై, ఎన్నో ఘనకార్యాలు చేశావు. ఇంక ఈ జీవితం చాలు. ఈ నీ అసలు వంశానికి కీర్తిప్రతిష్ఠలు చేకూర్చు. నీ తండ్రి వసుదేవు డెంతో గొప్పవాడు. మీ ఇద్దరిలాటి కొడుకులుండి కూడా, కంసు డికి భయపడుతూ, ఆ దుర్మార్గుడి చేత మానాలుపడుతూ, కొడుకులను అడవులు పాలు చేశానే అని మహాకుమిలి పోతు న్నాడు. కంసుడు మీ తండ్రిని అనరాని మాట లంటూంటే, మేమందరమూ చేసేది లేక, తలలు వంచుకుని, కంట తడిపెడతాం.
ఇక మీ తల్లి దేవకీదేవి దుఃఖం చెప్పటా నికే లేదు. వరసగా ఆమె గర్భాన పుట్టిన బిడ్డలందరినీ కంసుడు చంపేశాడు. అంత మంది పిల్లలను కని కూడా ఆ ఇల్లాలు ఒక్క బిడ్డకు పాలిచ్చి ఎరగదు. ఇంత చక్కనివాడివి, నీ ముఖం ఎలా ఉంటుందో ఆ తల్లికి తెలుసునా? ఆవిడ మాతృత్వం సఫలం చేసే భారం నీ పైన ఉన్నది. నీవంటి కొడుకును పెట్టుకుని ఆవిడ అహ అవర్నిశలు దుఃఖంలో ముణిగి తేలుతున్న దంటే, ఇంతకంటె గొడ్రాలితనమే మేలు గదా ?" అంటూ అక్రూరుడు కృష్ణుడికి హితోపదేశం చేశాడు.
ఆయన మాటల సారాంశం కృష్ణుడికి అర్థమయింది. అతను మధురానగరానికి వెళ్ళి, కంసుణ్ణి చంపి, తన తల్లిదండ్రు లైన దేవకీ వసుదేవులకు ఆనందం చేకూర్చాలి.
తెల్లవారింది. అక్రూరుడూ, బలరామ కృష్ణులూ కాలకృత్యాలు తీర్చుకుని రథం ఎక్కారు. అక్రూరుడు రథం తోలుతూ వ్రేపల్లె దాటి, మధురకు వెళ్ళే దారిపట్టాడు. కొందరు గోపికలు రథాన్ని కొంతదూరం వెంబడించారు. కృష్ణుడు వెళ్ళిపోవటం వాళ్ళకేమీ బాగాలేదు. కొందరు అక్రూరుణ్ణి బాగా తిట్టుకున్నారు. మరికొందరు, “ రేపు ఏ రాక్షసుడన్నా మనమీద వచ్చిపడితే ఎవరు కాపాడతారు? కృష్ణుణ్ణి వెళ్ళిపోని స్తున్న మనవాళ్ళు వెర్రివాళ్ళుకారా ?” అని అడిగారు. వాళ్ళు కొంతదూరం రథాన్ని వెంబడించి, అతివేగంగా వెళ్ళే రథాన్ని అనుసరించలేక ఆగి, రథం లేపే దుమ్ము కనబడకుండా పోయేదాకా చూసి, తిరిగి వెళ్ళిపోయారు.
మధ్యాన్నం దాకా నడిచి రథం కాళిందీ తీరాన ఒక కదంబవృక్షం నీడలో ఆగింది. అక్రూరుడు బలరామకృష్ణులతో, "నేను నదిలో స్నానంచేసి, అర్ఘ్యం విడిచి, ఇప్పుడే వస్తాను. అంతదాకా మీరు రథం లోనే ఉండండి. ఈలోపుగా గుర్రాలు గరికి మేస్తాయి,” అని చెప్పి, నదిలోకి దిగి, నడుములోతు నీటిలో ముణిగాడు.
అలా ముణిగిన అక్రూరుడికి నీటిలో రసాతలం కనబడింది. అక్కడ వాసుకీ, కర్కోటకుడూ మొదలైన నాగశ్రేష్టులు తిరుగుతున్నారు. చాలా అందంగా నిర్మిం చిన రత్నమండపం లోపల వెయ్యి తలల ఆదిశేషుడు కనిపించాడు. అతని శరీరం స్వచ్ఛంగానూ, తెల్లగానూ, చుట్టలు చుట్టు కుని ఉన్నది. పడగలు ఎత్తి ఉన్నాయి. అతని నాలుకల వరస మెరుపుతీగలాగా చలిస్తున్నది. అతని పార్శ్వాల రోకలీ, నాగలి, తాటిచెట్టూ గుర్తులు గల జెండాలున్నాయి. ఆ శేషుడి చుట్టలపైన కృష్ణుడు, నల్లగా, తామరకన్నులతోనూ, పసుపు పచ్చని బట్టతోనూ కూర్చుని కనిపించాడు.
అలా కనిపించిన కృష్ణుణ్ణి అక్రూరుడు మంత్రాలతో ఆరాధించి, మానసికంగానే వివిధ అర్చనా సామగ్రితో అర్చించాడు. తరవాత అతను నీటిలో నుంచి పైకి లేచి చూసేసరికి, రథం మీదనున్న బలరామ కృష్ణుల దేహాలపైన తన అర్చన తాలూకు గుర్తులు కనిపించాయి. అక్రూరు డది చూసి మరింత అద్భుతపడి, మళ్ళీ నీటిలో ముణిగి, తిరిగి ఆదిశేషుణ్ణి, అతని పైన కూర్చుని ఉన్న కృష్ణుణ్ణి చూశాడు.
చివరకు అక్రూరుడు తన అనుష్ఠా నాలు ముగించుకుని రథాన్ని చేరరాగానే కృష్ణుడు, "అక్రూరుడా, చాలా ఆలస్యం చేశావు. పాతాళంలో ఏదో చోద్యం కని పించినట్టున్నదే? నీ ముఖాన ఆశ్చర్యం చూస్తే అలాగే ఉన్నది,” అన్నాడు.
"దేవా, నువు దగ్గిరలో ఉండటం కన్న పెద్ద చోద్యం ఇంకేం కావాలి? నువూ, నీ అన్నా ఇక్కడ కనిపించినట్టే నీటిలో కూడా కనిపించారు. నీ వాస్తవరూపం వర్ణించటం బ్రహ్మకైనా సాధ్యంకాదే, నేనేపాటివాణ్ణి ? నా పైన వాత్సల్యం ఉంచి అనుగ్రహించు. మనం ఇంక బయలు దేరాలి. కంసుడు మీ కోసం ఆత్రంగా- ఎదురుచూస్తూ ఉంటాడు. సూర్యాస్త మయం లోపల మనం నగరం చేరాలి,” అన్నాడు అక్రూరుడు.
కృష్ణుడు నవ్వి, "నీ చేతిలో ఉన్నాం, మా చేతిలో ఏమీలేదు,” అన్నాడు.
రథం తిరిగి బయలుదేరి సాయంకాలం వేళకు మధురానగరం చేరింది. కృష్ణుడు అక్రూరుడితో, "నగరం అనేది ఎట్లా ఉంటుందో ఎన్నడూ చూసినవాళ్ళం కాము. కంసమహారాజును చూసినదాకా ప్రాణా లాగేటట్టు లేవు, అందుచేత ముందుగానే నాలుగు వీధులూ చుట్టివస్తాం, అనుమ తించు,” అన్నాడు.
అక్రూరుడు వాళ్ళను రథం దించి, " మీకు వసుదేవుడి ఇంటికి వెళ్ళాలనిపించ వచ్చు. కాని ఆ పని చెయ్యకండి. ముందు తనకు కనపడకుండా వసుదేవుణ్ణి చూస్తే కంసుడికి కోపం వస్తుంది,” అని చెప్పి, బలరామకృష్ణులను తీసుకొచ్చానని కంసు డితో చెప్పటానికి వేగంగా రథం తోలు కుంటూ వెళ్ళిపోయాడు.
కట్టుతాళ్ళు విప్పిన ఏనుగుల జంట లాగా బలరామకృష్ణులు మధురానగరపు రాజవీధి వెంబడి, నగరపు వింతలను ఆశ్చ ర్యంగా చూసుకుంటూ, ముందుకు నడవ సాగారు. వారలా నడుస్తుంటే అక్కడి పౌరులు వారిని చూసి రకరకాలుగా మాట్లాడుకున్నారు.
కొంతదూరం వెళ్ళేసరికి బలరామకృష్ణు లకు రంగకారు డనే చాకలి కనిపించాడు. అతను రకరకాల బట్టలు మడతలు పెట్టి మూటగట్టి తీసుకుపోతున్నాడు.
"ఏమోయ్, చాకలీ? మేం రాజుగారిని చూడబోతున్నాం. రాజసభకు వెళ్ళేవాళ్ళు మంచిమంచి బట్టలు కట్టుకుని మరీ వెళ్ళాలి గద. అందుచేత నీ దగ్గిర ఉన్న బట్టల్లో మంచివి చూసి మా కియ్యి, మంచి వాడివి !" అన్నాడు కృష్ణుడు.
ఆ మాటకు చాకలి చాలా కోపించి, 'అడవుల్లో పశువుల మధ్య తిరిగే అనాగ రికపు మొహాలకు కంసమహారాజు కట్టే బట్టలు కావలిసివచ్చాయా ? ఈ బట్టలంటే ఏమిటనుకున్నారు? ఎక్కడెక్కడి రాజులో కంసమహారాజుకు కానుకగా పంపినవి. పిచ్చిపిచ్చిగా మాట్లాడక, పదండి,” అన్నాడు. కృష్ణుడికి కోపం వచ్చింది. అతను కత్తి పెట్టి చాకలి మెడ మీద ఒక్కటి పెట్టాడు. తల తెగి కిందపడి చాకలి కాస్తా చచ్చాడు.
"మేము దేశాంతరం నుంచి వచ్చిన మల్లులం. మీ రాజుగారినీ, రాజ్యాన్నీ, విల్లుకు జరగబోతున్న గొప్ప ఉత్సవాన్ని చూసి సంతోషింతామని వచ్చాం. నీ గొప్ప నువు చెప్పుకున్నావనుకో. మేము ఊరికే నిన్ను ఎలా మెచ్చుకోం? ఆ పాత్రలో ఉన్న గంధం ఇచ్చావంటే, మేము పూసు కుని, నిన్ను మెచ్చుకుని వెళ్ళి రాజుగారి దర్బారులో కాస్త కళగా కూర్చుంటాం,” అన్నాడు కృష్ణుడు.
ఆ మాటకు కుబ్జ నవ్వి, "సరే తీసు కోండి," అంటూ తన పాత్రలోని గంధం ఇచ్చేసింది. కృష్ణుడు ఆ గంధాన్ని ముందు బలరాముడి కిచ్చి, తనకు కావలిసినది తాను కూడా పూసుకుని, మిగిలినది అక్కడ ఉన్న పిల్లల కిచ్చేశాడు. అతనికి ఆ కుబ్జ్బను మామూలు మనిషి చెయ్యాలనిపించింది. అందుకని అతను, ఆ కుబ్జ కాలివేళ్ళను తన కాలివేళ్ళతో నొక్కి పట్టి, చూపుడు వేలుతో ఆమె ముఖం పైకెత్తాడు. వెంటనే ఆమె రూపు మారిపోయి, ఆమె శరీరం వంకలు తీరింది. సన్నని నడుమూ, చదు నైన వీపూ, దీర్ఘమైన దేహమూ ఏర్ప డ్డాయి. ఆమె తనను తాను చూసు కుని అద్భుతమూ, ఆనందమూ పొంది, నవ్వుతూ కృష్ణుణ్ణి చూసి, "నా కెంతో మహెూపకారం చేసిన మహానుభావుడవు, మా యింటికి వచ్చి నన్ను ధన్యురాలిని చెయ్యి. నీ దారిన నువు పోతానంటే ఊరు కోను," అన్నది, అతని చేతిని తన చేత్తో పట్టుకుని.
"నా కిప్పుడు బోలెడంత పని ఉన్నది. మళ్ళీ వస్తాను. నువు నా దానివే ననుకో,” అంటూ కృష్ణుడు మంచిగా ఆమె చెయ్యి విడిపించుకుని, బలరాముడితో సహా ముందుకు సాగాడు. వాళ్ళిద్దరూ తమ ఉద్దేశాలనూ, బింకాన్నీ పైకి కనబడనీయక, మామూలు గొల్లవాళ్ళలాగానే ప్రవర్తించుతూ, నెమ్మదిగా నడుచుకుంటూ కంసుడి మందిర ద్వారాన్ని చేరుకున్నారు. అక్కడ చాలా కోలాహలంగా ఉన్నది. "కంసుడికి ఎందరెందరో రాజులు పంపిన కానుకలు, ఏనుగులూ, గుర్రాలూ, రథాలూ, సుందర వస్తువులూ వేల సంఖ్యలో ఎడతెగ కుండా వచ్చి చేరుతున్నాయి.
లోపల ఆయుధాగారం ఉన్నది. దాన్ని బంగారంతోనూ, పెద్దపెద్ద మణులతోనూ చాలా అందంగా నిర్మించారు. అనేకమంది రాజులు దాన్ని చూడవచ్చారు. అసంఖ్యాకు లైన భటులు దానికి రక్షగా ఉన్నారు.
"కంసమహారాజుగారి విల్లు ఇక్కడేనా ఉండేది? దాన్ని చూద్దామని చాలా దూరం నుంచి వచ్చాం. ఏదీ ? చూడవచ్చునా?” అని బలరామకృష్ణులు అమాయికంగా అనే సరికి, రక్షకభటులు వాళ్ళను విల్లున్న చోటికి తీసుకుపోయారు. అది బ్రహాండమైన విల్లు, తక్షకుడి శరీరంలాగున్నది.
దాన్ని చూసి కృష్ణుడు, "దీన్ని ఎక్కు పెట్టటం దేవతలకూ, దానవులకూ కూడా సాధ్యంకాదంటారే. నిజం ఏమిటో చూస్తాం,” అంటూ ఆ విల్లును ఒక్కచేత అవలీలగా ఎత్తి, చులాగ్గా నారి సంధించి మీటాడు. అది చేసిన మోత భయంక రంగా అన్ని దిక్కులా ప్రతిధ్వనించింది. అక్కడ ఉన్నవారంతా నిర్ఘాంతపోయి చూస్తూండగా, కృష్ణుడు ఆ వింటిని తన పిడికిటపట్టి పెళుక్కున విరిచేశాడు. గొప్ప ఉత్సవం చేసుకోనున్న ఆ విల్లు కాస్తా ముక్కలు ముక్కలయింది. కృష్ణుడు తన కేమీ తెలియనట్టు చల్లగా జనంలో కలిసి పోయి ఆయుధాగారం నుంచి బయట పడ్డాడు. ఆయుధాగారాన్ని రక్షించే భటులు ఒకరి కన్న ఒకరు ముందు పరిగెత్తి కంసుడి అంతఃపురానికి వెళ్ళి, జీరపోయిన గొంతులతో, జరిగిన సంగతంతా కంసుడికి నివేదించారు.