9. కంసుడి ఆహ్వానం | Kamsa Invites Krishna to Mathura | Lord Krishna Avatar Story in Telugu

writer
0

కృష్ణుడికి యౌవనం సంప్రాప్తమయింది. అతని అందము, బలమూ వ్రేపల్లెలోని స్త్రీలనందరినీ సమ్మోహింపజేశాయి. అతను వేణువు ఊదితే వాళ్ళకు మతులు పోయేవి. తల్లిదండ్రులూ, భర్తలూ, బంధు వులూ చివాట్లు పెడుతున్నా లక్ష్యపెట్టక, వాళ్ళు వేణునాదాన్నిబట్టి మందలు మంద లుగా అతని దగ్గిరికి పోయేవాళ్ళు, అతనితో విచ్చలవిడిగా విహరించేవాళ్ళు. ఈ ఆడ మూకను వెంట వేసుకుని కృష్ణుడు నృత్యాలు చేసేవాడు, పాటలు పాడేవాడు, యమునలో జలక్రీడ లాడేవాడు, దాగుడు మూతల లాటి ఆటలాడేవాడు. కృష్ణుడు వారితో అహోరాత్రాలు ఇలాటి క్రీడలలో గడపసాగాడు.

ఒకనాటి అర్ధరాత్రి, చుట్టూ వలయంగా గోపికలను నిలిపి, మధ్యతా నుండి ఆటల వేడుకలో ఉండగా అరిష్టు డనే రాక్షసుడు ఒక బలమైన ఆబోతు రూపం ధరించి పెద్దగా రంకెలు పెడుతూ కృష్ణుణ్ణి ధ్వంసం చెయ్యటానికి వచ్చాడు.

ఆ ఆబోతు ఆకారమూ, అది పెట్టే. భయంకరమైన రంకెలూ చూసి గోపికలు భయపడి కళ్ళు మూసుకుని, కృష్ణుడి చాటుకు వెళ్ళారు.

భయపడ వద్దని కృష్ణుడు గోపికలకు ధైర్యం చెప్పి, మీదికి వస్తున్న ఆ ఆబోతు కొమ్ములు రెండూ గట్టిగా పట్టుకుని కదల లేకుండా చేసి, బలంగా దాని మెడ మెలి పెట్టి, ఒక్క తోపు తోశాడు.

నోటా, ముక్కులా రక్తం కక్కుతూ ఆ ఆబోతు చచ్చి పడిపోయింది. అప్పటికి గోపికలకు ధైర్యం వచ్చి, అతన్ని చుట్టు ముట్టి, ప్రశంసించారు.

ఇక్కడ కృష్ణుడిలా ఉంటే, మధురా పురంలో కంసుడు నిత్యమూ చస్తున్నాడు. అతని మనస్సంతా వికలమయింది, జీవ చ్ఛవం లాగా తయారయాడు. ఒక నాడతను తన సభాభవనానికి ఉగ్రసేనుణ్ణి, వసు దేవుణ్ణి, సత్యకుణ్ణి, అంధకుణ్ణి, కంపకుణ్ణి, దారుకుణ్ణి, విపృథుణ్ణి, బభ్రుణ్ణి తదితర యదు, భోజ ప్రముఖులను పిలిపించి, ఇలా అన్నాడు:

"మీ రందరూ గొప్ప మే ధా వు లు, జ్ఞానులు, ఎలాటి సమస్యలనైనా పరిష్క రించ గలవారు, నాకు ఎంతో మేలు చేయా లనే దృష్టిగలవారు. అయినప్పటికీ, నా కిప్పు డొక పెద్ద ప్రమాదం వచ్చిపడినా, ఏ కారణం చేతనో మీరు చూస్తూ ఉండి పోయారు. నందగోపుడికి పుట్టిన కృష్ణుడనే వాడు నన్ను నిర్మూలించటానికి సిద్ధంగా ఉన్నాడు. వాడు అశ్రద్ధ చేసిన జాడ్యంలాగానూ, గాలి తోడైన మేఘంలాగానూ, విషవృక్షంలాగానూ దిన దినమూ వృద్ధి పొందుతున్నాడు. వాడెలాటి అంశతో పుట్టినదీ, ఎంత ఆలోచించినా అంతుపట్టకుండా ఉన్నది. ఏ దేవతాంశనో పుట్టాడేమోననిపిస్తుంది. ఎందుకంటే వాడి చరిత్రంతా అమానుషంగానే ఉన్నది. చెబుతాను వినండి.”

కంసుడు వారితో కృష్ణుడి పనులన్నీ వివరించి చెప్పాడు: సరిగా కళ్ళు తెరవని దశలోనే పూతనను చంపాడు; బోర్లా పడటం కూడా రాని రోజుల్లోనే బండిని ఒక్క తన్నుతో తుత్తునియలు చేశాడు; . తప్పటడుగులు వేసే ఈడున జంట మద్ది చెట్లకు రోలు తగిలించి లాగి, కూల్చేశాడు; ఒక టేమిటి? ఆరోజు కారోజు గడుస్తున్న కొద్దీ కాళియుణ్ణి మర్దించాడు, ప్రలంబుణ్ణి, ధేనుకుణ్ణి చంపించాడు, అరిష్టుణ్ణి చంపాడు. బాల్యం మాట దేవు డెరుగు, వయసు వచ్చిన వాళ్ళు మాత్రం ఇలాటి పనులు చేయ గలిగారా ? ఏడురోజులు ఎడాతెరిపి లేకుండా కుంభవర్షం కురిస్తే కొండను అవలీలగా గొడుగల్లే ఎత్తేసి పట్టుకున్నాడు. ఆ అమా నుష కార్యం ఒక్కటే చాలు, మిగతావి చెప్పుకో నవసరం లేదు. 

ఇదంతా చెప్పి కంసుడు వారితో మళ్ళీ ఇలా అన్నాడు:

"ఇక మిగిలి ఉన్న రాక్షసుడు కేశి ఒకడే. కేశి కూడా కృష్ణుడి చేత చచ్చా డంటే ఆ తరవాత వచ్చేది నా వంతే. చంప మరిగినవాడు నన్ను మాత్రం విడిచి పెడతాడా? వట్టిది. కృష్ణుడే అనుకుంటే వాడంతవాడు వాడి అన్న బలరాము డొకడు. కూడా ఉన్నాడు. అసలు జరిగిన దేమిటో నారదుడు నాకు చెప్పాడు. దేవకీదేవి అర్ధ రాత్రి వేళ కొడుకును కంటే, ఈ వసుదేవుడు వాణ్ణి తీసుకుపోయి నందగోపుడి భార్య పక్కలో పెట్టి, ఆమె కన్న ఆడపిల్లను తెచ్చి తన భార్య పక్కలో పెట్టాడు. అది కూడా నాకు అందకుండా ఆకాశాని కెగిరి, వింధ్యవాసినీ దేవత అయి కూర్చున్నది. ఇంతకాలంగా అయిన వాడల్లే నటిస్తూ వసుదేవుడు నా కొంత ద్రోహం చేశాడు. నేను ఎంత మర్యాద చేశానో, నాకు అంత గొప్ప ద్రోహం చేశాడు.”

తరువాత కంసుడు వసుదేవుడి కేసి తిరిగి, "నీ ఆలోచన నాకు తెలుసు : నీ కొడుకు చేత నన్ను చంపించి, వాణ్ణి మధురకు రాజు చేసి ఏలింతా మనుకుంటున్నావు. కాని నీ కొకటి తెలీదు: ఇంద్రుడే వచ్చినా నన్నేమీ చెయ్యలేడు. అక్కడే భ్రమపడ్డావు. చక్రవర్తి వంశంలో పుట్టావు, చిన్నతనం నుంచీ మా తండ్రి దగ్గిర పెరిగావు. మా చెల్లెల్ని పెళ్ళాడి, యాదవులందరికీ గురు స్థాన మైనావు; ఇలాటి నీచమైన పని చేస్తావా ? నీ పాతకం నీకే ఉండనీ, నేను నిన్ను చంపను. బంధు మిత్ర బ్రాహ్మణ హత్యలు చేసినవాణ్ణి కాను, చేయను కూడా. నిన్ను వెళ్ళగొట్టవచ్చు, కాని అది కూడా చెయ్యను. నీ అంతట నువు పోతేపో, ఉంటే ఉండు," అన్నాడు.

తరవాత కంసుడు భోజవంశం వాడైన అక్రూరుడి కేసి తిరిగి, "నేను ఈ యేడు నా ధనుస్సుకు గొప్ప ఉత్సవం చెయ్య బోతున్నాను. దానికి ఎక్కడెక్కడి రాజులూ వస్తారు. చాలా రోజులపాటు విందు చెయ్య వలసి ఉంటుంది. గోకులం నుంచి పుష్కలంగా పెరుగూ, పాలూ, నెయ్యి, అడవి తేనే కావలసి వస్తుంది. అందుచేత నువు గోకులానికి వెళ్ళి ఇవన్నీ వచ్చేటట్టు ఆజ్ఞ ఇయ్యి. తిరిగి వచ్చేటప్పుడు నంద గోపుణ్ణి, అతని కుటుంబాన్నీ వెంట బెట్టు కురా. నా మేనల్లుళ్ళయిన బలరామకృష్ణు లను చూడాలని నాకు మహా వేడుకగా ఉంది. వాళ్ళు మహా బలులట. నేను తమను చూడాలని ఉవ్విళ్ళూరుతున్నానని నమ్మకం కలిగే లాగా చెప్పి, వాళ్ళను వెంట బెట్టుకురా. నా దగ్గిర ఇద్దరు మేటి మల్లు లున్నారు. వీళ్ళకూ, వాళ్ళకూ పోటీ పెట్టి వాళ్ళ బలపరాక్రమా లెలాటివో చూస్తాను. వాళ్ళిద్దరినీ తెచ్చావంటే నాకు మహోపకారం చేసిన వాడవవుతావు. వసు దేవు డేమన్నా చెవిలో ఊదుతాడేమో, అదేమీ వినిపించుకోక, నువు వెంటనే బయలుదేరు,” అన్నాడు.

కంసుడి పరివారంలో కృష్ణుణ్ణి భగవం తుడి అవతారంగా భావించే వారు చాలా మంది ఉన్నారు. వారిలో అక్రూరు డొకడు. కృష్ణుణ్ణి కళ్లారా చూసి తరించే అవకాశం దొరికినందుకు లోపల పొంగి పోతూ, అక్రూరుడు కంసుడి వద్ద సెలవు పుచ్చుకుని అప్పటికప్పుడే రధం ఎక్కి, వ్రేపల్లెకు బయలుదేరాడు.

మొత్తం మీద కంసుడు వసుదేవుణ్ణి గురించి అంతమంది మధ్యా అలా మాట్లా డటం పెద్దల కందరికీ కర్ణకఠోరమనిపిం చింది. వారిలో వృద్ధుడైన అంధకుడనే యాదవుడు నిర్భయంగా ముందుకు వచ్చి, కంసుడితో ఇలా అన్నాడు :

"నువ్వన్న మాటలు రాజోచితమైనవి కావు. ముందూ వెనకా ఆలోచించకుండా పెద్దవాణ్ణి పట్టుకుని ఎంతెంతమాట లన్నావు! ఇలాటి ప్రవర్తనతో నీ తల్లిదండ్రులకూ, వంశానికి తీరని కళంకం తెచ్చావు. వసు దేవుడు తన కొడుకును దాచాడని తప్పు పట్టు తున్నావా? తల్లిదండ్రులు తమ సంతానాన్ని కాపాడుకోవటానికి అడ్డమైన అగచాట్లూ పడరా ? 'నీ తల్లిదండ్రులు నీ కోసం ఏ పాట్లూ పడకుండానే నువ్వింత వాడివయావా? నీ ధోరణి మాకు ఏమీ బాగా లేదు. నీతో " తెగతెంపులు చేసుకుని వెళ్ళి పోలేక పోవటం మాదే బుద్ధి తక్కువ. మా కన్న ఆ అక్రూరుడు చాలా అదృష్ట వంతుడు. కృష్ణుణ్ణి చూసి వచ్చిన అక్రూ రుణ్ణి చూసి మేము కూడా పవిత్రుల మవుతాం. కృష్ణుడు యిక్కడికి వచ్చాడంటే నీకు చావు తప్పదు. నీ కెవరూ అడ్డపడ లేరు. అందుచేత నువే ముందు గోకులంలో వున్న కృష్ణుడి వద్దకు వెళ్ళి, అతన్ని మంచి చేసుకుని బాగుపడు.” 

అంధకు డిలా అనే సరికి పట్టరాని కోపం వచ్చి, కంసుడు చివాలున లేచి వెళ్ళి పోయాడు. మిగిలిన వారు కూడా తమతమ ఇళ్ళకు వెళ్ళారు.

అక్రూరు డింకా గోకులం వెళ్ళక పూర్వమే కంసుడు కేశి అనే రాక్షసుణ్ణ బృందావనానికి పంపాడు. గుర్రం రూపు గల ఆ రాక్షసుడు బృందావనం చేరి, అక్కడి అరణ్యంలో మేతలు మేసే పశు వులనూ, గోవులను కాసే వారినీ నాశనం చెయ్యసాగాడు.  గుర్రాన్నీ, భయంకరమైన దాని అవతారాన్నీ చూస్తే గోకులాని కంతకూ దడ పుట్టుకొచ్చింది. ఆ గుర్రం పశువుల కండలు చీల్చి తినేది, వాటి రక్తం తాగేది. అది అరణ్యంలో ఎక్కడా ఒక్క మృగం లేకుండా చేసి గోపకుల నివాసాల కేసి వచ్చింది. దాన్ని అంత దూరంలోనే చూసి గోకులంలో వాళ్ళు కృష్ణుణ్ణి శరణు జొచ్చారు. కృష్ణుడు వాళ్ళకు భయపడ వద్దని చెప్పి, చప్పట్లు చరుస్తూ గట్టిగా కేక పెట్టి కేశిని కవ్వించాడు.

ఇలా కవ్వించటం చూసి గుర్రానికి చాలా పౌరుషం వచ్చింది. కృష్ణుడి చేతిలో ఎలాటి ఆయుధమూ లేకపోయేసరికి దాని పౌరుషం రెట్టింపయింది. అది పెద్దగా నోరు తెరిచి, దంతాలను భయంకరంగా బయట పెట్టి, పెద్దపెట్టున సకిలిస్తూ కృష్ణుడి పైకి వచ్చింది. అది వెనకకాళ్ళపై నిలబడి ముందు కాళ్ళెత్తి తన పైన దూకబోతే, కృష్ణుడు ఒడుపుగా పక్కకు తప్పుకుని, చప్పున తన చెయ్యి దాని నోట దూర్చి, దాని నాలుక మొదలంట పట్టుకున్నాడు.

వెంటనే గుర్రం ఆట కట్టింది. అది, కృష్ణుడి పట్టు తప్పించుకోలేక, అతన్ని కరవలేక, ఇంకేమీ చెయ్యలేక, కాళ్ళు నేల కేసి తాటిస్తూ, గుడ్లు వెళ్ళబెట్టి అతి హీన స్థితిలో పడింది. కృష్ణుడు దాని నాలుక పెరికి, కంఠం చీల్చి, పళ్ళు రాల్చి, దాని డొక్కలో చెయ్యి దూర్చి కెలికి, మహాదారు ణంగా చంపేశాడు.

గోకులంలో వాళ్ళంతా పెద్దనిట్టూర్పులు విడిచారు. అందరూ చుట్టూరా చేరి అతన్ని ఎంతగానో అభినందించారు. గోపికలు పూల దండలు తెచ్చి కృష్ణుడి మెడ నిండా వేశారు. 

అప్పుడు నారదుడు అదృశ్యంగా ఆకా శంలో ఉండి, తన పేరు చెప్పుకుని కృష్ణు డితో, "నాయనా, కలహప్రియుణ్ణయిన నేను నీ యుద్ధం చూడటానికి ప్రత్యేకంగా దేవలోకం నుంచి వచ్చాను. నువు చూపిన ఈ పరాక్రమం ఇంద్రుడికి చెల్లేను, శివుడికి చెల్లేను, మరెవరికీ సాధ్యం కాదు. ఆ ఇంద్రుడే అయినా ఎదుర్కోలేని ఈ కేశిని . సునాయాసంగా చంపావు. వీణ్ణి చంపి నందుకు నువు కేశవు డనే పేరుతో ప్రసిద్ధుడి వవుతావు,” అని చెప్పి వెళ్ళిపోయాడు.

ఈ లోపల అక్రూరుడు మధుర నుంచి, మేలైన గుర్రాలను పూన్చిన రథంలో బయలుదేరి, ఎక్కడా ఆగకుండా సాయం కాలం వేళకు వ్రేపల్లె చేర వచ్చాడు.. సూర్యాస్తమయమై, చీకట్లు కమ్ముతూం డగా, వాటిని చెదరగొట్టుతూ చంద్రుడు ఉదయించాడు. గోకులం సందడిగా ఉన్నది. ఎక్కడ చూసినా వేలకొద్దీ గోవులు. గోప కులు వాటిని పేర్లు పెట్టి పిలుస్తున్నారు. పాలుపితికే ధ్వనులు వినబడుతున్నాయి. ఇలా కోలాహలంగా ఉన్న గోకులం మధ్యకు అక్రూరుడు రధాన్ని తోలు కొచ్చి, అంత దూరాన బలరామకృష్ణులను చూసి పరమాసంద భరితుడయాడు. అతను చప్పున కృష్ణుణ్ణి సమీపించి తన గోత్రనామాలు చెప్పుకుని, కృష్ణుడి పాదాలకు నమస్కారం చేశాడు. కృష్ణుడతన్ని లేవనెత్తి కౌగిలించు కుని, కుశల ప్రశ్నలు వేసి, బలరాముడి వెంట అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు.


అక్రూరుడి కోరిక మీద నందగోపుడు మొదలైన పెద్దలందరూ అతని వద్దకు వచ్చారు. వారితో అక్రూరు డిలా అన్నాడు: 

"కంసమహారాజు తన ధనువుకు గొప్పగా ఉత్సవం చేయ తలపెట్టాడు. మీ రందరూ మీరు మీరు చెల్లించ వలసిన కప్పాలు తీసుకు వచ్చి చెల్లించండి, విందు లకు గాను నేతులు మొదలైనవి తీసుకు రండి. ఈ ఉత్సవానికి ఈ బలరామ కృష్ణులు కూడా రావాలని కంసమహారాజు మహావేడుక పడుతున్నాడు. మీరు వెంటనే ప్రయాణం కట్టండి. నేను వీరిద్దరినీ రధం మీద తీసుకుని బయలుదేరుతాను.”

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)