ఆయుధాగారపు భటులు వచ్చి తన విల్లు విరిగిందని చెప్పగానే, కంసుడికి తన వీపే విరిగినట్టయింది. అతను పుట్టెడు విచా రంతో లేచి, ఉత్సవానికి చేసిన ఏర్పాట్లు చూడబోయాడు. ఒక అందమైన రంగ స్థలం ఏర్పాటుచేసి, రాజూ, మంత్రులూ, పై నుంచి వచ్చే రాజులూ, రాజబంధు వులూ, భృత్యులూ, పౌరులూ, విలాసి నులూ కూర్చోవటానికి వేరువేరు స్థలాలు నిర్మించి, వాటికి మెట్లు అమర్చారు. అంతటా కనులపండువైన శిల్పాలూ, తెరలూ, తోరణాలూ ఉన్నాయి. అంతటా అలంకార వస్తువులూ, పూలూ, ధూపాలూ ఏర్పాటై ఉన్నాయి. వీటన్నిటినీ పరీక్షించి, పనివాళ్ళకు అవసరమైన పనులు చెప్పి, కంసుడు తన అంతఃపురానికి తిరిగివచ్చి, చాణూరముష్టికు లనే మల్లులను పిలిపించి, "ప్రపంచంలో మీసాటి మల్లులు లేరు. బలరాముడూ, కృష్ణుడూ అనే గొల్లకుర్ర కుంకలు ఇప్పటిదాకా అడవిలో తిరిగిన వాళ్ళు. వాళ్ళకు ధైర్యమూ, ప్రతాపము, శౌర్యమూ ఏ కోశానా లేవు. వాళ్ళు మీతో తలపడినప్పుడు మీరు వాళ్ళతో చాలాసేపు పెట్టుకోక, ఒక దెబ్బన చంపేసినట్టయితే నాకు చాలా మేలు కలుగుతుంది,” అన్నాడు.
రాజు ఈ విధంగా అడిగినందుకు సంతోషించి మల్లులు, " మా కింతగా చెప్పాలా ? ఆ గొల్లబ్బాయిలు చిక్కగానే నలిపేస్తాం. మా సంగతి తమ రెరగరా? ఇది మా కొక పనా ?" అని చెప్పి, పెద్దగా మల్లలు చరిచి, బొబ్బలు పెట్టి తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు.
తరువాత కంసుడు మహామాత్రుడనే మాపటివాణ్ణి పిలిపించి, "నువు నాకు చాలా ఆప్తుడివి. నీతో ఇప్పుడు ముఖ్యమైన పని పడింది. వసుదేవుడి కొడుకులు గొల్ల పల్లెలో పెరిగి, గొల్లలలాగే తయారైనారు. వాళ్ళు మహా చెడ్డవాళ్ళు, బలవంతులు. వాళ్ళిక్కడికి వచ్చి ఉన్నారు. ముందుగానే వేకువవేళ నువు కువలయాపీడాన్ని తీసు కుని రాజభవనద్వారం దగ్గర సిద్ధంగా ఉండి, వాళ్ళు అక్కడికి రాగానే వాళ్ళ మీదికి దాన్ని ఉసిగొల్పు. కువలయాపీడం వాళ్ళిద్దర్నీ క్షణంలో పీనుగులను చేసే స్తుంది,” అన్నాడు.
మర్నాడు తెల్లవారింది. రాజ శాసనం ప్రకారం అందరూ వచ్చి రంగస్థలాన ఎవ రెవరి స్థానాలలో వారు కూర్చుని, బలరామ కృష్ణుల రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. కంసుడు చాలా ఎత్తున బంగారు సింహాసనం మీద, తెల్ల బట్టలూ, ముత్యాలతో కూడిన ఆభరణాలూ ధరించి, తెల్లటి గొడుగూ, వింజామరాలు వేయించు కుని, తెల్లని బట్టలు కట్టిన విలాసినులతో సహా చంద్రుడి లాగా ప్రకాశిస్తున్నాడు.
చాణూర ముష్టికులు మదించిన ఏను గుల లాగా ఉత్సవ రంగం ప్రవేశించి, కంసుడి కెదురుగా నిలబడ్డారు. మహా మాత్రుడు కువలయాపీడాన్ని ఎక్కి వచ్చి, ద్వారం వద్ద నిలిపి, బలరామ కృష్ణులు రాక కెదురు చూస్తున్నాడు.
కొంచెం సేపటికి బలరామ కృష్ణులు ద్వారం వద్దకు వచ్చారు. వారిని అందరూ అమితాశ్చర్యంతో చూశారు. వాళ్ళు ఎంతో నిశ్చింతగానూ, నిర్వికారంగానూ ఉన్నట్టు కనపడ్డారు. వాళ్ళు ద్వారం వద్ద కనిపించ గానే వాద్యాల మోతా, ప్రేక్షకుల హర్ష ధ్వానాలూ మిన్ను ముట్టాయి. ఆ కోలాహలం మధ్య మహామాత్రుడు కువలయా పీడాన్ని వాళ్ళ మీదికి తోలాడు.
అది గమనించిన కృష్ణుడు బలరాముడి కేసి నవ్వుతూ, " కంసుడు మనని చంపించ టాని కొక ఏనుగుగున్నను సిద్ధం చేశాడు. పాపం, తాను మృత్యువు కోరల సందున ఉన్న సంగతి ఎరుగడు. నువు నన్ను గమ నిస్తూ ఉండు," అని ముందుకు నడిచాడు. పెద్ద దంతాలూ, భయంకరమైన తొండమూ ఎత్తి, భూమి అదిరేలాగా అడుగులు వేస్తూ కువలయాపీడ మనే ఏనుగు మహా రౌద్రంగా కృష్ణుడి పైకి వచ్చింది.
కృష్ణుడు దానితో యుద్ధం చేసే మిష మీద తన బలం అందరికీ చూపుదామనీ, కాస్సేపు వినోదం పొందుదామనీ, ముందు ఏనుగును దాని తొండంతో తన రొమ్ము మీద కొట్ట నిచ్చాడు. తరువాత, ఎగిరి, దాని దంతాల పైన కాళ్ళు పెట్టి నిలబడి, ఎడమ కాలితో దాని కుంభస్థలాన్ని బలంగా తన్ని, దాని వీపు మీదికి వెళ్ళి, అది వెనక్కు చాచిన తొండాన్ని పట్టుకుని, కిందికి దూకి, పిడికిటితో దాని డొక్కల్లో పాడిచాడు. ఏనుగు వెనక్కు తిరిగే సరికి, దాని కాళ్ళ సందుగా వెనక్కు వెళ్ళి, దాని తోక పట్టు కుని గుండ్రగా తిప్పాడు. ఏనుగు చేసేది లేక కింద పడి, వెంటనే లేచి, అమిత రోషంతో అతని పైన తొండంతో బాదింది, దంతాలతో పొడిచింది. కృష్ణు డిక దాన్ని చంప నిశ్చయించి, ఎగిరి కాలితో దాని ముఖం మీద తన్ని, దాని దంతం ఒకటి బలంగా పెరికి, దానితోనే ఏనుగు తలను బద్దలు కొట్ట నారంభించాడు. త్వరలోనే కువలయాపీడం నేల కూలి ప్రాణాలు విడి చింది. దానితో బాటు కింద కూలిన మావటి వాడి తల దాని దంతంతోనే పగలగొట్ట కృష్ణుడు వాణ్ణి కూడా చంపేశాడు.
ఏనుగు చేసిన గాయాల నుంచి రక్త ధారలు కారుతూ, చేతిలో దాని దంతం పట్టుకుని మహా భయంకరాకారంతో సభలో ప్రవేశించిన కృష్ణుణ్ణి చూసి కంసుడు అమిత క్రోధంతో చాణూరుడి కేసి చూసి, కృష్ణు డితో మల్లయుద్ధం చెయ్యమని ఆజ్ఞా పించాడు. అలాగే ముష్టికుణ్ణి బలరాముడితో యుద్ధం సాగించమన్నాడు.
చాణూర ముష్టికులు ఆంధ్రులు. దిగ్గజా లను పోలినవాళ్లు. ప్రపంచంలో తమకు చాలినవాళ్లు లేరన్న గర్వాతిశయం గల వారు. చాణూరుడు కృష్ణుణ్ణి సమీపించి వెటకారంతో కూడిన కోపంతో, "గోవులను కాస్తూ, గొల్ల పిల్లలను భయపెట్టి గొప్ప ఖ్యాతి సంపాదించావు గాని, ఇవాళ నా పాల పడ్డావు, తప్పించుకోలేవు. మహా రాజు, మెచ్చుకునేటట్టుగా నిన్నిప్పుడే యమకింకరులు కప్పగిస్తాను,” అన్నాడు.
కృష్ణుడు చాణూరుడితో తాపీగా, " కంసుడు నీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నాడు. అందుచేత నీ బలమంతా చూపించు. వ్యర్థాలాపాలతో ఏమవుతుంది?” అంటూ మల్లచరిచాడు.
చాణూరుడు కృష్ణుడి పైకి కలియ బడ్డాడు. సభలో ఉన్న యాదవులు కృష్ణుణ్ణి గురించి భయపడ్డారు. "కొండంత చాణూ రుడికి, పిల్లవాడు కృష్ణుడికి మల్లయుద్ధ మేమిటి ? అన్యాయం! ఇక్కడ ఉండే పెద్దలకు ఆ మాత్రం జ్ఞానం లేదా? అదీ గాక, మల్లయుద్ధం చేసే పద్ధతి ఇది కానే కాదు. మల్లులతో యుద్ధం చేసేవారికి సహా యకులు వెంట ఉండి, అలిసినప్పుడు శైత్యాది ఉపచారాలు చెయ్యాలి, మోటు బలానికి నేర్పరితనానికి తేడా గమనించాలి, అవసరమైనప్పుడు యుద్ధం ఆపాలి. ఇది వినోదం గాని, విరోధుల మధ్య కొట్లాట కాదే! అయినంత మటుకు చాలు. రాజు గారు ఇద్దరినీ తగిన విధంగా సత్కరించి, యుద్ధం ఆపు జెయ్యటం మంచిది,” అని యాదవులు తమలో తాము అనుకోసాగారు.
ఆ మాటలు విని కృష్ణుడు వారితో, "నన్ను ఇలాగే పోట్లాడ నివ్వండి. మనో బలమూ, పరాక్రమమూ, ఓపికా, ఉత్సా హమూ, జయమూ ప్రదర్శించే యోధుడికి ఒడ్డూ, పొడుగూ, వయసుతో ఏం పని? నేను పగపట్టి వీణ్ణి చంపాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. మిమ్మల్ని మెప్పిస్తాను. మీరు అదీ ఇదీ అనక, చూస్తూ ఉండండి. ఈ చాణూరుడు కరూశ దేశంలో పుట్టిననాడు. ఎందరో మల్లులను హతమార్చిన వీణ్ణ పడగొట్టి గొప్ప కీర్తి సంపాదిస్తాను,” అని చాణూరుడితో మల్లయుద్ధం ప్రారం భించాడు.
ఆ యుద్ధంలో ఆరితేరిన చాణూర్యుణ్ణి మించిన నేర్పు కృష్ణుడు చూపాడు. ఒకరి నొకరు వంచుతూ, తోస్తూ, వంగుతూ, ఎగురుతూ, ఒదుగుతూ, పక్కకు తొలు గుతూ చాలా అద్భుతంగా వాళ్ళు యుద్ధం చేశారు. వీపుకు వీపూ, తలకు తలా తగిలి నప్పుడూ, ఒకరినొకరు గుద్దుకున్నప్పుడూ గొప్ప ధ్వనులు పుట్టాయి. ఒకరినొకరు చేతులతోనూ, కాళ్ళతోనూ తన్నుకుంటూ, దంతాలతోనూ, గోళ్ళతోనూ రక్కుకుంటూ పోరాడుతుంటే చూసేవారికి అతి భయంక రంగా ఉన్నది.
మొత్తం మీద అన్ని రకాల పట్లలోనూ కృష్ణుడి నేర్పే హెచ్చుగా కనబడి, సభి కోపంగా "ఆపండి" అన్నట్టు చేత్తో సంజ్ఞ కులు హర్షధ్వానాలు చేస్తే, కంసుడు " చేశాడు. కృష్ణుడు కొంతసేపు తన చాక చక్యం ప్రదర్శించి, ప్రదర్శించి, చాణూరుడి పని తేల్చెయ్య నిశ్చయించాడు. చాణూరుడి పని కూడా చాలావరకు అయిపోయింది. దుర్బలుడైపోతున్న ఆ మల్లుడి పైన కృష్ణుడు ఒక్కపెట్టున లంఘించి, వాడి నడి తల మీద పిడికిలితో ఒక్కపోటు పొడిచి, ఎగిరి మోకాలితో వాడి గుండెలో ఒక్క తాపు తన్నాడు. ఆ దెబ్బతో చాణూరుడు గుడ్లు వెళ్ళబెట్టి, నోట నెత్తురు కక్కుతూ కిందపడి ప్రాణాలు వదిలాడు.
కృష్ణుడు చాబూరుణ్ణి చంపే లోపునే బలరాముడు ముష్టికుణ్ణి హత మార్చేశాడు. మల్లు లిద్దరిని కడతేర్చి, బలరామకృష్ణులు రంగస్థలాన విజయులై నిలబడ్డారు. వాళ్ళు కంసుడి కేసి చూసిన చూపూ, కంసుడి ముఖంలో కనిపించిన క్రౌర్యమూ చూసి నందగోపుడు మొదలైన గోపకు లందరూ భయంతో వణుకుతూ, కుక్కిన పేనుల్లాగా ఉండిపోయారు.
తాను కని పారేసిన కొడుకు చాణూరుడి చేతిలో ఏమైపోతాడో, ఇంత కాలానికి కనపడి అంతలోనే ప్రాణాలు విడుస్తాడేమో నని తల్లడిల్లిన దేవకీదేవి, చాణూరుణ్ణి చంపిన తన కొడుకు దర్పం చూసి ఆనం దాశ్రువులు రాల్చింది. వసుదేవుడి ఆనం దానికి కూడా మేరలేదు.
కంసుడికి మాత్రం ముఖాన చెమటలు పోస్తున్నాయి. దురాగ్రహంతో శరీరమంతా కంపిస్తున్నది. ఊపిరి భారంగా తీస్తు న్నాడు. ఎర్రటికళ్ళ నుంచి నిప్పులు కక్కే వాడిలాగా చూస్తూ అతను, నాలుగు వైపులా చూసి, తన నౌకర్లను పిలిచి, "ఈ గొల్ల కుర్రాళ్ళను ఇద్దరినీ తీసుకుపోయి నగరం దాటి పంపెయ్యండి. నందగోపుణ్ణి పట్టు కుని, సంకెళ్ళతో బంధించండి. మిగిలిన గోపకులందరినీ శిరశ్ఛేదం చెయ్యండి. నా రాజ్యంలో గొల్లవాడన్నవాడు కనిపిస్తే దొంగలను శిక్షించినట్లు శిక్షించండి. గొల్లల సొత్తు తీసేసుకోండి. కుటిలుడైన వసుదేవు డికి క్రూరమైన శిక్ష ఇవ్వండి,” అని ఆజ్ఞాపించాడు.
ఈ మాటలు విని ఎక్కడివాళ్ళక్కడ కొయ్యబారిపోయారు. మళ్ళీ శోకం ముంచు కొచ్చి దేవకీదేవి మూర్ఛపోయింది.
కృష్ణుడు తన తల్లిదండ్రుల దైన్యమూ, బంధువర్గంపడే బాధా, సభలో ఉన్న వాళ్ళ అసహాయస్థితి చూసి ఆగ్రహావేశం చెందాడు. అతను ఊహించరాని వేగంతో సింహాసనం మీద కంసుడున్న చోటికి మెట్లెక్కి వచ్చాడు.
సభలో వాళ్ళకు కృష్ణుడు ఎక్కి రావటం కనిపించలేదు. ఒక క్షణం రంగస్థలంలో ఉన్నాడు, మరుక్షణం అతను కంసుడి వద్ద ఉన్నాడు.
మరుక్షణం అతను కంసుడి కిరీటాన్ని తన్నేశాడు, దాని మణులు రాలాయి. కంసుణ్ణి జుట్టు పట్టుకుని తల వంచి, తల అంతటా పిడికిలితో తెగ పొడిచాడు. మోకాలితో గుండెల్లో పొడిచాడు. కంసుడు ఏమీ చెయ్యలేకపోయాడు. అతని మెడలో హారాలు తెగిపోయాయి. చెవిలో పెట్టు కున్న పూలు రాలాయి. బట్ట ఊడి పోయింది. ముక్కునా, చెవులా, నోటా రక్తం చిమ్మేలాగా, కనుగుడ్లు వెళ్ళు కొచ్చేలాగా కంసుణ్ణి కృష్ణుడు పై నుంచి కిందికి తోసి, చేత్తో నెట్టాడు. ఆ తోపుతో కంసుడి శవం రంగద్వారాన పరిఘ ఆకా రంలో పడిపోయింది.
ఇదే సమయంలో బలరాముడు, కంసుడి తమ్ముడైన సునాము డనేవాడి పైన సింహంలాగా లంఘించి, వాణ్ణి హత మార్చేశాడు.
కృష్ణుడు కంసుణ్ణి చంపిన చేతులతోనే వసుదేవుడి పాదాలు తాకి నమస్కరిం చాడు. వసుదేవుడు కృష్ణుణ్ణి గాఢంగా కౌగలించుకుని ఆశీర్వదించాడు. తరువాత కృష్ణుడు దేవకికి నమస్కరించాడు. ఆమె అతన్ని కౌగలించుకుని తల వాసన చూసింది.
తరువాత కృష్ణుడు ఉగ్రసేనుడికి, పెద్ద లకూ మొక్కి వారి దీవనలు పొంది, అందరినీ వెళ్ళిపొమ్మని చెప్పి, తాను బలరాముడితో సహా తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు.