కుంభకుడి మందలో పుట్టిన రాకాసి కోడెలను గురించీ, అవి చేసే దురాగతాలను గురించీ, ప్రజలు మొరపెట్టుకోగా, మిథిల రాజు కుంభకుణ్ణి పిలిపించి, "నీ కోడెలు తమను బతకనివ్వటం లేదని పౌరులు ఆక్రోశిస్తున్నారు. నువ్వయినా ఘరానా మనిషివే గాని, సాదా మనిషివి కావు; నీకు బోలెడంత బలగమున్నది. పదిమందీని సహాయం పిలిచి, ఆ పోట్లగిత్తలను వెంటనే అదుపులో పెట్టెయ్యి, లేదా బీజాలు తీయించు, అలాగూ కాకపోతే అరణ్యంలోకి తరిమెయ్యి,” అని గట్టిగా హెచ్చరించి పంపాడు.
కుంభకుడి కేమీ పాలుపోలేదు. ఆ పొగరు బోతు కోడెలను నిగ్రహించటం అతని తరం కాలేదు. అందుకు ప్రయత్నించినప్పుడు చాలామంది గాయపడ్డారు, కొందరు చచ్చారు కూడా. అందుచేత అతను, మరొక ఉపాయ మేదీ తోచక, తన కోడెలను జయించిన వాడికి తన కుమార్తె అయిన నీళ్ల నిచ్చి పెళ్ళి చేస్తానని చాటాడు.
ఈ చాటింపు వింటూనే ఎక్కడెక్కడి నుంచో గోపయువకు లందరూ పరిగెత్తు కుంటూ వచ్చారు. గోవుల మధ్య జీవించే వాళ్ళకు గొడ్లను పంచడం ఎంత పని అని వాళ్ళ ఉద్దేశం. అందుచేత తేలికగా మంచి భార్య దొరుకుతుందని వాళ్ళు ఆశపడ్డారు.
అలా వచ్చిన వాళ్ళు తలా ఒక విధంగానూ ప్రగల్భాలు పలికారు. ఒకడు కోడెలను కొమ్ములు పట్టి వంచేస్తానన్నాడు. ఇంకొకడు వాటిని పడదోసి పట్టి, ముక్కులు కుట్టుతానన్నాడు. ఇలా బీరాలు పలుకుతూ గోపకులు మల్లలు చరిచారు, అరిచారు, పరుగులు తీశారు, హంగామా చేశారు.
చాటింపు వేసిన సమయంలోనే కుంభకుడు నందగోపుడి వద్దకు మనుషులను పంపాడు. ఆ మనుషులు వచ్చి ఏడెద్దుల సంగతంతా చెప్పగానే నందుడూ, యశోదా, వాళ్ళ వెంట బలరామ కృష్ణులూ, మరి కొందరు గోపకుమారులూ బయలుదేరారు.
కుంభకుడు తన అక్కకూ, బావకూ ఎదురు వచ్చి స్వాగతం చెప్పాడు. కుంభకుడి భార్య ధర్మద యశోదకు మర్యాదలు చేసింది. కుంభకుడి కొడుకు శ్రీధాముడు కృష్ణ బలరాములను కౌగలించుకుని, వాళ్ళకు తానే పీటలు తెచ్చి వేశాడు. పాయ సాలూ, నేతులూ పుష్కలంగా వడ్డించు కుని అందరూ భోజనాలు చేశారు.
ఆ రాత్రి రాకాసి ఎద్దులు, కృష్ణుడు వచ్చిన సంగతి గ్రహించి, విజృంభించాయి; చూడి ఆవులను కొమ్ములతో పొడిచాయి; ఆ తరువాత కుంభకుడి అంగణంలో చొర బడి, రంకెలు పెడుతూ, గిట్టలతో నేలను తవ్వుతూ అట్టహాసం చేసి, కుండలు పగల గొట్టి, గోడలు గీరి, గరిసెలు కూలదోసి, బళ్ళు విరగదన్ని, పందిళ్ళు పడదోసి, తలుపులు విరగదన్ని నా నా భీభత్సమూ చేశాయి. ఆడవాళ్ళూ, పిల్లలూ హాహాకారాలు చేశారు. పై నుంచి వచ్చిన గోపకులు ఎక్కడ వీలుంటే అక్కడ దాక్కున్నారు.
తెల్లవారింది. కుంభకుడు గోపుల నందరినీ పిలిపించాడు. తన కూతురిని అలంక రింప జేసి తెచ్చి వారి ముందు నిలబెట్టి. "గోపకుమారులారా, చూశారు గదా ? ఈ పోట్ల గొడ్లు దిగ్గజాలలాటివి, సింహాల లాటివి. వీటిని అదుపులోకి తేవాలని మేము చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయాయి. వీటిని అదుపులో పెట్టకపోతేనేమో రాజు గారు మమ్మల్ని దండిస్తారు. అందుచేతనే మహాబలులూ, అత్యంత సమర్థులూ అయిన మీ అందరినీ పిలిపించాను. మీలో ఎవరు ఈ పోట్ల గొడ్లను శిక్షించినా, అతనికి ఈ పిల్లనిచ్చి పెళ్ళి చేసేస్తాను,” అన్నాడు.
గోపకుమారులంతా ఈ మాటలు విని పెద్ద సందిగ్ధంలో పడ్డారు. నీళను చూస్తే మనసులు ఉవ్విళ్ళూరుతూ ఉత్సాహం పొందుతున్నాయి. రాకాసి ఎడ్లను తలుచు కుంటే గుండెలు నీరై, కాళ్ళు చల్లబడు తున్నాయి. అందుచేత ఎవరూ ఒక. నిశ్చ యానికి రాలేని స్థితిలో చిక్కుపడ్డారు.
అప్పుడు నందుడి జ్ఞాతి అయిన ఘోష వంతు డనే గోపకుడు, "ఈ బోడి ఎద్దులను చంపలేకపోతే నా బలపరాక్రమా లెందుకు? చూస్తూ ఉండండి, ఒక్కక్షణంలో వీటిని కూల్చిపారేస్తాను,” అని మల్లచరిచి, పోట్ల ఎద్దుల మీదికి వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు దూర దూరంగా, చెట్ల మీదా, పుట్టల మీదా, 'గట్ల మీదా నిలబడి ఆశగా చూడసాగారు.
ఘోషవంతుడు ఒక ఎద్దు నెత్తిన పిడి టితో బ లం కొద్దీ కొట్టాడు. చూసే వాళ్ళంతా హర్షధ్వానాలు చేశారు. మరుక్షణమే ఏడు ఎద్దులూ అతన్ని చుట్టు ముట్టాయి. కృష్ణుడు మాత్రం విచారంతో, "ఇతనెందు కిలాటి పని పెట్టుకున్నాడు? ఎద్దులితన్ని ప్రాణా లతో వదులుతాయా?" అనుకుంటున్నాడు. అంతలోనే ఎద్దులు అతన్ని తమ కొమ్ము లతో పొడిచి ఎత్తి, నేల మీద విసిరికొట్టి, తమ కాలిగిట్టలతో దూరంగా తన్నేశాయి.
చూస్తున్న వాళ్ళంతా హాహాకారాలు చేశారు. ఈ విధంగా ఘోషవంతుణ్ణి నేల పాలు చేసిన ఎద్దులు మిగిలిన గోపక సమూహం పైనపడి, కొమ్ములతో పొడుస్తూ, గిట్టలతో మట్టగిస్తూ, నోళ్ళతో కొరుకుతూ, అందరినీ చెదరగొట్టి పారదోలసాగాయి.
అప్పుడు కృష్ణుడు బలరాముడితో, “ఇవి ఎద్దులు కావు. ఎద్దుల కింత కసి, ఇంత సాహసమూ ఉండటం అసంభవం. కుంభ కుడికి నే నే సహాయం చేస్తాను,” అన్నాడు. అని అతను ఆ పోట్లెద్దులను సమీపిస్తూ ఉంటే, నందుడూ, యశోదా కూడా, వద్దురా, బాబూ !" అని కేకలు పెట్టారు.
కృష్ణుడు మహా కోపంతో పిడికిలి బిగ బట్టి వస్తుంటే, అన్నదమ్ములైన ఆ ఏడు రాక్షసి ఎద్దులూ, పాత పగ కొద్దీ కోపావేశం చెంది, ఒక్కసారిగా అతని పైకి దూకుతూ వచ్చాయి. అతను అందిన ఎద్దులను. అరి చేతులతో ముఖాల మీద కొట్టి, కొమ్ములు పట్టుకుని ఒక ఎద్దును మరొక ఎద్దు మీదికి తోసి, కొన్నిటిని తోకలు పట్టి గిరగిరా తిప్పి, కొన్నిటి ముట్టెలూ, వీపులూ వాయ గొట్టి, చూసేవారందరికీ మహాశ్చర్యం కలిగేలాగా పోరాడాడు. ఇదంతా అతనికి ఆట - చూసే వాళ్ళ వినోదం కోసం ఆడిన ఆట. చూసే వాళ్ళలో నీళ కూడా ఉన్నది. ఆమె ఎంతో ప్రేమతోనూ, సిగ్గుతోనూ తన కేసి చూస్తుంటే కృష్ణుడికి చాలా ఆనందం కలిగింది.
చిట్టచివర కతను ఈ ఆట కట్టిపెట్టి ఒక్కొక్క పిడికిటి పోటుతో ఒక్కొక్క ఎద్దును తల పగలగొట్టి, ముక్కులా నోటా . నెత్తురు కక్కించి, కాలనేమి కొడుకు లేడు గురిని కడతేర్చేశాడు. నందుడూ యశోదా పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుణ్ణి కౌగలించు కున్నారు.. కుంభకుడు నీళ్ళను చెయ్యిపట్టి కృష్ణుడి దగ్గిరికి తీసుకొచ్చి, అతని చేతిలో ఆమె చెయ్యి పెడుతూ, "ఇదుగో నీ పరా క్రమానికి కానుక. నీ మరదలు నీ సొత్తే అయింది. ఏలుకో,” అన్నాడు.
ఆయన కృష్ణుడికి వస్త్రాభరణాలూ, యశోదానందగోపులకు బట్టలూ, మిగిలిన గోపకుమారులకు ఇతర కానుకలు ఇచ్చి, నందుడితో, "బావా, నీ కొడుకు ఉద్దండ ప్రచండ శూరుడు. అతడి దయవల్ల మాకు భయంకరమైన ఆపద తొలగిపోయింది. నా పరువు దక్కింది. ఇక మేము హాయిగా బతుకుతాం. నీళ్లకు వేలకువేలు గోవులను అరణంగా ఇస్తాను. నా సంతోషం కొద్దీ ఇచ్చే వీటిని నిరాకరించకు,” అన్నాడు.
"పిచ్చివాడా, నాకు కట్టుకు పోయినన్ని గోవులున్నాయి. కృష్ణుడు పుట్టాక మా మందలు తెగ వృద్ధి చెంది, అంతులేని పాలు ఇస్తున్నాయి. ఆ పాల నుంచి ఎత్తుకు ఎత్తు నెయ్యి అవుతున్నది. అందరమూ సుఖంగా ఉంటున్నాం,” అన్నాడు నందుడు.
ఆ రోజు మహెూత్సవంగా గడిపి నంద యశోదలూ, నీళనూ, తోడుగా శ్రీధాముణ్ణి వెంట బెట్టుకుని కృష్ణుడూ, మిగిలినవాళ్ళూ తమ బృందావనానికి బయలుదేరి వెళ్ళి పోయి, సుఖంగా జీవించసాగారు. నూత్న యౌవనంలో ప్రవేశించిన కృష్ణుడు పసుపు పచ్చని పట్టు బట్ట కట్టి, నెమలి కన్నులు గల తలపాగా ధరించి, అడవి పువ్వుల మాలలు మెడలో వేసుకుని, వేణుగానంలో ఓలలాడుతూ అంతటా తిరుగుతున్నాడు.
ఒకనాడు బలరామకృష్ణులు పశువులను మేపటానికి యమునా తీరాన గల ఒక మహా వటవృక్షం వద్దకు వెళ్ళి, చుట్టూ గోవులు మేస్తూంటే వాటిని చూస్తూ ఆ మర్రిచెట్టు కింద కూర్చున్నారు. మిగిలిన గోపబాల కులు ఆటలాడు కుంటున్నారు.
ఆ సమయానికి వామదేవుడూ, భరద్వా జుడూ అనే మహామునులు తీర్థయాత్రకై అటుగా వచ్చి, బ్రహ్మాండమైన మర్రి చెట్టును చూడగానే దానికి ప్రదక్షిణ నమ స్కారాలు చేసి, అక్కడ ఉన్న గోపకులతో, "అబ్బాయిలూ, పాములూ, మొసళ్ళూ లేకుండా స్నానం చెయ్యడానికి అనువైన రేవు, యీ ప్రాంతాల ఎక్కడ ఉన్నది?" అని అడిగారు.
గోపకులు ఒకళ్ళముఖాలు ఒకరు చూసు కుంటూ, "నాకు తెలీదు, వాణ్ణి అడగండి," అని ఒకరినొకరు చూపుకున్నారు. అల్లరి వెధవలు ఆకతాయితనం చేస్తున్నారని కృష్ణుడు లేచి మునీశ్వరులను సమీపించి, వినయంగా, "మహామునులారా, వీళ్ళకు మంచి రేవేదో ఏం తెలుస్తుంది ? మీకు దివ్య మైన రేవు నేను చూపిస్తాను. మీ కాల కృత్యాలూ, అనుష్ఠానాలూ పూర్తికాగానే తిరిగి ఇక్కడికి రండి. చిక్కాలలో మీగడ పెరుగుతో కలిపిన చద్ది ఉన్నది. చక్కెర కలిపిన పాయసం బోలెడంత తెచ్చాం. మీరు హాయిగా ఆరగించవచ్చు. లేదా, అప్పటికప్పుడు ఉష్ణధారలు పిండి మీకు తాగటానికి ఇస్తాం. నేను నందుడి కొడు కును. నా పేరు కృష్ణుడు. ఇతను మా అన్న బలరాముడు,” అన్నాడు.
ఆ మునీశ్వరులు తమతో మాట్లాడిన ఆ కుర్రవాడి తేజస్సు చూసి, గోపకులంలో ఇలాటి వాడు ఎలా కలిగాడా అని ఆశ్చర్య పడి, క్షణంపాటు కళ్ళు మూసుకుని, సమాధిశక్తి ద్వారా నిజం తెలుసుకున్నారు. వాళ్ళు కృష్ణుడితో, "మా అదృష్టం నాయనా ! బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళు విశ్వప్రయత్నం చేసినా కనబడని నిన్ను మేము ఇవాళ ఇక్కడ చూడగలిగాం ! మా జన్మ సార్థకమయింది. నిన్ను కొడుకు నుగా కన్న ఆ తల్లిదండ్రులు అదృష్ట వంతులు,” అంటూ కృష్ణుణ్ణి పొగడి తమ దారిన తాము వెళ్ళిపోయారు.
మళ్ళీ కృష్ణుడికి జీవితం మామూలుగా గడిచిపోతున్నది. అతను బలరాముడితో సహా గోపబాలకుల వెంట ఆవుల మందలతో బాటు మేత ప్రదేశాలన్నీ తిరుగుతూ, ఆడుతూ, పాడుతూ హాయిగా ఉంటున్నాడు. ఒకనాడతను యమున వెంబడి చాలా దూరం వెళ్ళి అందులో ఒక భయంకర మైన మడుగొకటి చూశాడు. అది చాలా పెద్దది. అందులో సముద్రపు నీరు తెరి నట్టు నీరు తెర్లుతున్నది. దాని పైన దట్టంగా అవిరి కప్పి ఉన్నది. దాని సమీపంలో ఉన్న తీరాల వెంబడి గల చెట్లూ, లతలూ మాడి ఉన్నాయి. దాని నుంచి బయలు దేరే అలలు భయంకరంగా ఒడ్లను కొట్టు కుంటున్నాయి. ఆ ప్రాంతాల ఒక పిట్టగాని, ప్రాణిగాని బతికేటట్టు లేదు.
ఆ మడుగులో కాళియుడనే మహాసర్పం ఉంటున్నదనీ, దాని నోట అగ్నిజ్వాలలు వెలువడు తూంటాయనీ, ఆ కాళియుడికి గరుత్మంతుడి భయం లేదనీ కృష్ణుడు అది వరకే విని ఉన్నాడు. ఇప్పుడీ మడుగు చూస్తూంటే ఆ మాట నిజమే అయి ఉంటుందనిపించింది. అతను ఆ మడుగు లోకి ప్రవేశించి, ఆ మహాసర్పం మదమణ గించి, మడుగును పశువులు దిగటానికి వీలుగా చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. అందువల్ల మరొక మేలు కూడా ఉన్నది. అదేమిటంటే, ఈ కాళియుడి పరివారానికి చెందిన పాములు అసంఖ్యాకంగా వన మంతటా సంచరిస్తూ, బృందావనంలోని కొన్ని ప్రాంతాలను అపాయకరంగా చేస్తున్నాయి; కాళియుణ్ణి తగిన విధంగా మర్దించి నట్టయితే ఈ చిల్లర సర్పాల ఆటకట్టవు తుంది. ఇది ఎలాగూ చేసి తీరవలసిన పని. అలాటప్పుడు జాప్యందేనికి ? వెంటనే చేస్తే సరిపోతుంది.
ఇలా అనుకుని కృష్ణుడు మడుగు ఒడ్డును సమీపించాడు. నీటి అంచున, నిలువునా మాడిపోయిన కదంబవృక్షం ఒకటి ఉన్నది. కృష్ణుడు దానిపైకి ఎక్కి, మడుగులో కి దూక నిశ్చయించాడు. అతను ఎవరితోనూ సంప్రతించలేదు. చంకలో ఉన్న పలుపు తాళ్ళు అవతల పడ వేశాడు. తన ఢక్కా, వేణువూ మరొకరి కిచ్చాడు. నెత్తి మీది పింఛం తీసేసి, జుట్టు ముడివేసుకున్నాడు. బట్ట వెనక్కు విరిచి కట్టాడు. చెప్పులు వదిలేసి కదంబవృక్షం మీది కెక్కి, పొలో మని పెద్ద కేక పెట్టి మడుగులోకి దూకే శాడు. అతను పడ్డ చోట నది నీరు ఇంతెత్తున పైకి చిమ్మింది.