ఆ యేడు చక్కని వర్షాలు కురిశాయి. పశువులూ, వాటి దూడలూ చక్కగా నవనవ లాడుతూ తయారయాయి. పంటలు బాగా పండాయి. గడ్డి, లతలూ, చెట్లూ సమృద్ధిగా పెరిగాయి. పాడీ, పంటా ఎన్నడూ లేనంత బాగా గోకులానికి లభించాయి.
వానలు వెనకపట్టి శరత్కాలం వచ్చింది. నందగోపుడు మొదలుగా గల పెద్దలు తమలోతాము మాట్లాడుకుని ఇంద్రోత్సవం చేద్దామని నిశ్చయించుకున్నారు. అనుకోవట మేమిటి, మరుక్షణమే అందుకు ప్రయ కూడా ప్రారంభమయాయి. అందరూ హడావుడిగా తిరగసాగారు.
కృష్ణుడీ హడావుడి చూసి నవ్వుతూ గోపకులతో, "మీరంతా ఎందు కింత సంభ్రమంలో ఉన్నారు? ఏం పండగ ఇది ? ఏ దేవుణ్ణి కొలవబోతున్నారు? ఆ దేవుడి పల్ల కలిగే లాభా లేవి ? " అన్నాడు.
గోపకులలో అతి వృద్ధుడైనవాడు కృష్ణుడితో, "బాబూ, లోకపాలకు లందరికీ ఇంద్రుడు రాజు గదా. వర్షర్తువు అతనిదే నాయె. గోగణాలకు మేలు చేసే ఆ దేవుడు గోపకులకు ఎంతైనా కొలవదగిన దేవుడు. అందుచేత ఇంద్రోత్సవం తలపెట్టాం,” అని చెప్పాడు.
అది విని కృష్ణు డిలా అన్నాడు : "మనుష్యుల కుండే వృత్తులు మూడు. అవేవంటే వ్యవసాయమూ, వర్తకమూ, పశుపోషణా. ఎవరే వృత్తి చేస్తే వారి కదే దేవుడు. మనం గోపాలకులం, అడవులలో ఉంటాం, కొండల్లో తిరుగుతాం, పశువులను పెంచుతూ జీవిస్తాం. అందుచేత మనకు అడవులూ, కొండలూ, పశువులూ దేవతలు. ఎవరి కుల దేవతలను వాళ్ళు పూజించాలి. కర్షకులు గ్రామాలలో నివసిస్తారు, ఆటవికులు అర ణ్యంలో నివసిస్తారు, మనం కొండలలో నివసిస్తాం. బ్రాహ్మణులు మంత్రయజ్ఞం చేస్తారు; కర్షకులు నాగలియజ్ఞం చేస్తారు, గోపాలకులు కొండయజ్ఞం చేస్తారు. అందు చేత మనం పర్వతోత్సవం జరపటం యుక్తంగా ఉంటుంది. నేను చెప్పినట్టు చెయ్యక పోయారో బలాత్కారంగా నైనా మీ చేత చేయిస్తాను.”
ఈ విధంగా కృష్ణుడు చాలా సేపు బోధిం చిన మీదట అతను చెప్పినది మిగిలిన వాళ్ళకు నచ్చింది. అదీ గాక వాళ్ళు. “పూర్తిగా కృష్ణుడి పైన ఆధారపడి, అతనే తమకు అన్నింటికీ దిక్కన్న ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే, అతను చేసిన అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. వాటికి తోడు అతను వాళ్ళను ఎన్నోసార్లు ఆపదల నుంచి కాపాడాడు. వాళ్ళ పాలిటికి అతను మనిషి కాదు, దేవుడు.
గోపాలకులు ఇంద్రోత్సవం మానేసి, బ్రాహ్మణులను పిలిపించి గిరియజ్ఞోత్సవా నికి తగిన ఏర్పాట్లు చేశారు. పాయసాలూ, అపూపాలూ, ఉండ్రాళ్ళూ మొదలైనవి తయారయాయి. రకరకాల అన్నాలూ, మాంసాలూ, మధువులూ, పచ్చళ్ళూ, పెరుగూ, నెయ్యి, పాలూ మొదలైనవి వీలునుబట్టి కావళ్ళలోనూ, బళ్ళ మీదా ఎక్కించారు. ఆబాలగోపాలంగా గోపికలూ, గోపకులూ వాద్యాలతో సహా వృద్ధగోపకుల వెంబడి, గోవర్థనపర్వతానికి జాతర చేస్తూ బయలుదేరారు.
గోవర్ధనగిరి సమీపంలో ఒక మంచి స్థలంలో పేడతో అలికి, అందంగా ముగ్గులు పెట్టి ఉన్న స్థలాన, కృష్ణుడి అధ్వర్యాన గిరిపూజ జరిగింది. కొండకు తాము తెచ్చిన ఆహారపదార్ధాలు నైవేద్యం పెట్టారు, గోపా లకు లందరూ కొండకు పుష్పాంజలు లిచ్చి నమస్కారాలు చేశారు. అందరూ ఈ పను లలో నిమగ్నులై ఉన్న సమయంలో కృష్ణుడే పర్వతాధి దేవత లాగా కొండశిఖరాన ప్రత్యక్షమై, అందరూ ఆశ్చర్యంతో చూస్తూం డగా, చెయ్యి చాచి నైవేద్య మంతా ఆర గించేశాడు. తరువాత అతను, "మీ భక్తికి మెచ్చాను. నాకు తృప్తి అయింది,” అన్నాడు.
గోపకులంతా చేతులు మోడ్చి, " దేవా, మే మంతా నీ దాసులం. నీ ఆజ్ఞకు లోబడి ఉన్నాం. మాకు ఏమి ఆనతిస్తావో ఇయ్యి. ఆ ప్రకారం నడుచుకుంటాం," అని పర్వత దేవుడితో అన్నారు.
"కొండరూపంలో ఉన్న నన్నే ఇక నుంచీ మీరు దేవతగా ఆరాధించండి. అలా చేస్తే మీ కోరిక లన్నీ తీరుతాయి, మీ గోవులు వృద్ధి పొంది అమృతధారలు పితుకుతాయి. నేను కామరూపంతో మీలో ఒకడుగా ఉంటూ ఉంటాను," అని చెప్పి కొండ మీది దేవుడు అదృశ్యమయాడు.
గోపాలకులు కొండ మీది కృష్ణుణ్ణి, కొండ కింది కృష్ణుణ్ణి ఒకే సమయంలో చూసి దణ్ణాలు పెట్టుకున్నారు. తరువాత వాళ్ళు తమ పశువుల కొమ్ములకు పూజ చేశారు, వాటి మెడలకు చిరుగజ్జెలు కట్టారు, లతలు తెచ్చి వాటి తలలకు చుట్టారు, ఇంకా అనేక అలంకరణాలు చేశారు. పెద్దపెట్టున కేకలు పెడుతూ కొండ చుట్టూ ప్రదక్షిణం చేసి, అక్కడక్కడా దిగదుడుపులు తీశారు. తర వాత బ్రాహ్మణ సంతర్పణలు చేసి, యజ్ఞ శేషాన్ని తాము తమవారితో కలిసి సంతో షంగా తిన్నారు. ఉత్సవం పూర్తి అయింది. కృష్ణుడితో సహా అందరూ వ్రేపల్లెకు తిరిగి వెళ్ళిపోయారు.
అక్కడ స్వర్గంలో ఇంద్రుడికి తీరని అవమానమై, పట్టరాని కోపం వచ్చింది. అతను సంవర్తం మొదలుగా గల మహా మేఘాలను పిలిచి, చూశారా, బృందా వనంలో ఉండే నందగోపకుడు మొదలైన ముసలి గొల్లలు మదమెక్కి, ఏటా నాకు చేసే పూజలు మాని, కపటి అయిన కృష్ణుడి మాటలు విని, ఒక చచ్చుకొండకు చేశారు. అంతటితో అయిందనుకున్నారు కాబోలు. మీరు ఏడురోజుల పాటు ఎడాతెరిపి లేకుండా బ్రహ్మాండమైన వాన కురిసి, వాళ్ళకు బతుకుతెరువుగా ఉండే గోవులకు హాని కలిగించండి. ఆ విధంగా ఆ గోపకులకు హాని కలిగించి వచ్చారంటే నేను చాలా సంతోషిస్తాను. నేను కూడా మీ వెనకే వచ్చి మీ ప్రతాపం ఏపాటిదో ఆకాశం నుంచి చూస్తాను,” అన్నాడు.
గోకులంలో వాళ్ళకు ఈశాన్యదిక్కున మెరుపులు కనిపించాయి. గాలి తీవ్రంగా వీచింది. ఎండ దుస్సహమై, దుర్భరమైన ఉక్క పుట్టుకొచ్చింది. చంటిపిల్లలు అలమ టించారు. పెద్దవాళ్ళకు కాళ్ళు బొబ్బ లెక్కాయి. చెట్టుచేమలకు చీడ పట్టు కొచ్చింది. వాన వచ్చే లక్షణాలు బాగా కనిపించాయి.
తూర్పున మేఘం పట్టి ఉరుముతున్నది. "ఈ అకాలవర్ష మేమిటబ్బా?” అను కున్నారు గోపపెద్దలు.
చూస్తూండగానే కాలమేఘాలు ఆకాశ మంతటా సంచారం సాగించి, సూర్యుణ్ణి చాటు చేశాయి. ఆకాశం సాంతం మూసుకు పోయింది. పెళ పెళార్భాటాలతో, కళ్ళు చెదిరే మెరుపులతో పిడుగులు పడనారం భించాయి. తరువాత వడగళ్ళు పడ్డాయి. ఆ వెంటనే, భూమ్యాకాశాల మధ్య ఎడం లేకుండా కుంభవర్షం ప్రారంభమయింది.
ఆ వర్షం చూసి గోపకులు బెదిరి పోయారు. ప్రళయం ప్రారంభమైనట్టు వారికి తోచింది. ఆ వర్షం నుంచి ప్రాణా లెలా కాపాడుకోవాలో, ఎక్కడకి పారిపోవాలో వారికి తోచలేదు. పశువుల పాట్లు వర్ణనాతీతం. చెట్లు కూడా తీవ్రంగా దెబ్బ తిన్నాయి, కొన్ని పిడుగులు పడి మాడి పోయాయి, కొన్నిటిని గాలి పడగొట్టింది, మరి కొన్ని వరదలలో కొట్టుకుపోయాయి. గాలివాన అక్కడి అరణ్యా లన్నిటినీ భీభత్సం చేసేసింది. పక్షులు అసంఖ్యా కంగా చచ్చాయి.
ఇక మనుషుల దుస్థితి వర్ణనాతీతం. గుడిసెలు కూలిపోయాయి. బళ్ళు తిరగ బడ్డాయి. పశువులు చాలా నశించాయి. వంటలూ, వార్పులూ లేవు. పాలుపితకటం నిలిచిపోయింది. ఆ దుస్థితిలో గోపకులు కృష్ణుడి వద్దకు వెళ్ళి, "నువే మాకు దిక్కు! కాపాడు! కాపాడు!" అని మొర పెట్టుకున్నారు.
కృష్ణుడికి ఇంద్రుడి దుర్బుద్ధి అర్ధ మయింది. తనకు జరగవలసిన ఉత్సవాన్ని కృష్ణుడు మాన్పించా డన్న రోషంతో, గోకులం మీద ఇంద్రు డిలా పగ దీర్చు కుంటున్నాడు. ఇలా చెయ్యటంతో కృష్ణుడు అసహాయుడైపోతాడని ఇంద్రుడి నమ్మకం. గోవర్ధనపర్వతాన్ని ఆకాశాని కెత్తి దాని కింద గోపకులకూ, గోవులకూ రక్షణ కలి గించటానికి కృష్ణుడు నిశ్చయించాడు.
అతను వెంటనే గోవర్ధన పర్వతాన్ని అవలీలగా భూమి నుంచి పెరికి, తన చేత్తో గొడుగు లాగా ఎత్తి పట్టుకున్నాడు. అతను దాన్ని పెకలించేటప్పుడు గండరాళ్ళు పెద్ద చప్పుడుతో కిందికి దొర్లి వచ్చాయి. చెట్లు కూలి పడ్డాయి. గుహలలో ఉండే సింహాలూ, బిలాలలో ఉండే పాములూ బయటి కి వచ్చాయి. దాని మీద ఉండే విద్యాధరులు పారిపోయారు; తపస్సు చేసుకునే మును లకు తపోభంగ మయింది.
కృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తి, "మీరూ మీ పశువులూ దీని కిందికి వచ్చెయ్యండి. వాన మిమ్మల్ని బాధించదు,” అని గోపకులను పిలిచాడు. వాళ్ళు బిలబిలా పరిగెత్తు ను కుంటూ, తమ సామానులనూ, బళ్ళనూ, స్త్రీలనూ, పిల్లలనూ, గోవులనూ వెంటబెట్టు కుని కొండ కిందికి వచ్చేశారు.
ఏడురోజులూ కుంభవర్షం కురిసిన తర వాత ఇంద్రుడు మేఘాలను ఉపసంహరించి వెళ్ళిపోయాడు. ఆకాశం నిర్మలమయింది. గోపకులు మంతా కొండ కింది నుంచి ఇవ తలికి వచ్చేసింది. కృష్ణు డా పర్వతాన్ని యథాస్థానంలో ఉంచేశాడు. తరవాత అతను కొండ మీద ఎక్కి కూర్చుని, చుట్టూ మేతలు మేస్తూ సంచరించే గోవులను చూడసాగాడు.
కృష్ణుడు చేసిన అద్భుతం చూశాక ఇంద్రుడు నిర్వికారంగా ఇంట్లో కూర్చోలేక పోయాడు. అతని కేదో బెదురు పుట్టింది; అందుచేత కొద్దిమంది దేవతలను వెంట తీసుకుని, ఐరావత మెక్కి, వజ్రాయుధం చేత బట్టి, భూలోకానికి దిగి, గోవర్ధనగిరి మీద కృష్ణుడు కూర్చుని ఉన్న చోటికి వచ్చి, కృష్ణుణ్ణి చూసి అతను దేవదేవుడని తెలుసు కుని, ఐరావతాన్ని దిగి, తల వంచి నమస్కరించాడు.
కృష్ణుడు ఇంద్రుణ్ణి చూడనట్టు నటిస్తూ నిశ్చలంగా కూర్చుని ఉండిపోయాడు. అతనికి తన మీద ఆగ్రహంగా ఉందని ఇంద్రుడు గ్రహించి, స్తోత్రపాఠాలు చది వాడు; గోపాలుడుగా ఉన్న కారణం చేత సర్వేశ్వరుడని గుర్తించలేక, తాను మదాంధత్వంతో అపచారం చేశానని ఒప్పు కున్నాడు; క్షమించ వలసిందని వేడుకు న్నాడు. తరువాత అతను కృష్ణుణ్ణి గోపతిగా అభిషేకించి, అతడికి దివ్యాంబరాభరణాలు కట్ట బెట్టాడు.
చివరకు ఇంద్రుడు ఇలా అన్నాడు.
"కంసుడి కింద ఇంకా అనేకమంది రాక్షసులు నీకు హాని చేయాలని ఉన్నారు. వారందరూ నీ చేత చస్తారు. కంసుణ్ణి కూడా చంపి నువు రాజువవుతావు. మీ మేనత్త అయిన కుంతికి ధర్మరాజూ, భీముడూ పుట్టాక నా వల్ల అర్జునుడు కలిగాడు. అతను నీకు భక్తుడై నిన్నాశ్రయిస్తాడు. నువ్వతన్ని ఆదరించి, కనిపెట్టి ఉండాలి, అతనికి కీర్తి తేవాలి, ముందుముందు కౌరవ పాండవ యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధంలో అసంఖ్యాకులైన రాజులు పాల్గొంటారు. అందులో అతనికి విజయం చేకూర్చిపెట్టాలి. ఇదే నా కోరిక. ”
దానికి కృష్ణుడు జవాబిస్తూ, “మా మేనత్త కొడుకులు అయిదుగురూ మహాపరాక్రమ సంపన్నులు. దేవతాంశలతో జన్మించినవారు. ఒకనాడు భూమి కంతకూ ఏలికలు కాబో తారు. అందరిలోకీ మధ్య వాడైన అర్జు నుడు అసాధారణ శౌర్యవంతుడు. ఈ విషయా లన్నీ నాకు ముందే తెలుసు. నువ్వెంత చెప్పావో అంతా చేస్తాను. నువు రావటం నాకు చాలా సంతోష కారణమయింది. ఇక నువు నిశ్చింతగా వెళ్ళ వచ్చు,” అని చెప్పాడు.
ఇంద్రుడు కృష్ణుడి కాళ్ళ మీద సాష్టాంగ పడి, అతని చుట్టూ ప్రదక్షిణంచేసి, ఐరా వత మెక్కి, దేవతలతో సహా తన లోకానికి వెళ్ళిపోయాడు. తరువాత కృష్ణుడు కొండ దిగి వ్రేపల్లెకు వచ్చేశాడు.
అతను రాగానే గోపప్రముఖు లందరూ అతని చుట్టూ మూగారు. అతను మామూలు మనిషి కాదని వారి కీ సారి పూర్తిగా తెలిసి పోయింది. వాళ్ళు అతనితో, "బాబూ, మా మధ్య ప్రచ్ఛన్నంగా ఉంటున్న నువు నిజంగా ఎవరు ? మూడులో కాలనూ రక్షించ గలిగినట్టున్నావు, ఇక్కడ గోవులను కాస్తున్నావే? నిన్ను చూస్తే మాకు భయంగా ఉంది, చెప్పొద్దూ !" అన్నారు.
కృష్ణుడు నవ్వి, "నేను మీవాణ్ణి గదా, ఈ ప్రశ్నలన్నీ దేనికి?" అన్నాడు. అందరూ పరమానంద భరితులయారు.